|
ముందున్నవన్నీ చిరు రోజులే |
|
|
'చిరంజీవి మంచి ప్రజాదరణ ఉన్న వ్యక్తి. మంచి వ్యక్తులు, సంఘంలో పేరు ప్రతిష్టలున్న వారు రాజకీయాల్లోకి రావడం లేదు. సమాజంలో ఒక మార్పు కోసం చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారు. ముందున్నవన్నీ ఆయన రోజులే. ఆవిధంగా ఎవరో ఒకరు ముందుకురావాలి.
ఆయనను కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదు. కేవలం మర్యాదపూర్వకంగా, శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రమే ఇక్కడకు వచ్చామ'ని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపి అమర్‌సింగ్ వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యం కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చిరంజీవితో చర్చలు జరిపిన అనంతరం అమర్‌సింగ్ తమ పార్టీ నేతలైన జయాబచ్చన్, జయప్రదతో కలసి మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను సమర్ధిస్తున్న మీరు, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రకటించుకున్న ప్రజారాజ్యంతో ఎలా కలుస్తున్నారని ప్రశ్నించగా 'రాజకీయాలు వేరు, వక్యిగత సంబంధాలు వేరు. వ్యక్తిగత సంబంధాలు కొనసాగించడానికి రాజకీయాలు అడ్డుకావు. మేం గతంలో చంద్రబాబుతో కలసి ఉన్నప్పడు కూడా ఇక్కడ కలసి పోటీ చేయలేదు. అయినా నేను కాంగ్రెస్ పార్టీ నేతనో, అధికార ప్రతినిధినో కాదు కదా?' అని ఎదురు ప్రశ్నించారు. కలామ్ వంటి గొప్ప వ్యక్తుల స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవిని అభినందించడానికే తాను వచ్చానన్నారు. చిరంజీవి, అమితాబ్‌బచ్చన్ ఇద్దరూ మంచి స్నేహితులని, తాను బచ్చన్ కుటుంబానికి స్నేహితుడిని కాబట్టే జయాబచ్చన్‌తో కలసి ఇక్కడికి వచ్చి, చిరును అభినందించానన్నారు. లండన్ షోలో ఉన్నందున అమితాబ్, అభిషేక్ రాలేకపోయారన్నారు. |