|
బారక్ ఒబామాకు పటిష్ట భద్రత! |
|
|
అమెరికా నూతన అధ్యక్షుడుగా ఎంపికై చరిత్రకెక్కిన కొద్ది గంటలలోపే ఆయన చుట్టూ భద్రతా వలయాలతో ఉక్కుకవచం ఏర్పాటు చేయడం...
పలువురిలో భయాందోళనలు కలిగిస్తోంది. చికాగోలోని గ్రాండ్ పార్క్‌లో లక్షా 60వేలమంది మద్దతుదారుల మధ్య విజయోత్సవాలను జరుపుకున్న సందర్భంగా ఒబామా చుట్టూ 12 అడుగులు ఎత్తు, 3 అంగుళాల మందంతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులను అమర్చడం పలువురిలో సందేహాలను రేకెత్తిస్తోంది.
ఒబామా, అతని ఉపాక్ష్యక్ష సహచరుడు జో బైడన్ ఆయన సతీమణిని భద్రతా జోన్ నుంచి బయటకు కదలరాదని ఇప్పటికే అధ్యక్షుడి భద్రతా బలగం సూచించింది. విజయోత్సవ సభ జరిగిన చికాగో పార్కు చుట్టూ ఉన్న ప్రతి భవంతి పైనా ఎఫ్‌బిఐ ఏజెంట్లు లేజర్ ఆయుధాలను ఎక్కిపెట్టి నిలుచోవడం చూపరులకు దిగ్భ్రాంతి కలిగించింది.
నల్లజాతికి చెందిన ఒబామాను వైట్‌హౌస్‌లో అడుగు పెట్టే ముందే చంపేస్తారేమో అనే భయాందోళనలు ప్రస్తుతం అమెరికాలో చాలామందిలో గూడు కట్టుకుని ఉన్నాయి. ఒబామా దేశాధ్యక్షుడిగా ఉండకూడదని భావిస్తున్న శక్తులు అమెరికాలో చాలానే ఉన్నాయని వీరిలో కొందరు అతి శక్తిమంతులని కూడా ప్రజలు కలవరపడుతున్నారు. |